కాపాడాలంటూ ఒక్కరోజే 7,500 ఫోన్లు వచ్చాయి.. ఢిల్లీ అల్లర్లలో ఆదివారం రాత్రి నుంచీ ఇదే పరిస్థితి

  • మంగళవారం ఢిల్లీలో భారీగా విధ్వంసం
  • అంతకు ముందురోజు సోమవారం కూడా 3,500 కాల్స్ వచ్చాయన్న పోలీసులు
  • ఆదివారం అర్ధరాత్రి నుంచీ ఇదే పరిస్థితి
ఢిల్లీలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఆందోళనలు, అల్లర్లలో బాధితులు తమను కాపాడాలంటూ పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్లు చేశారు. తామున్న ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతోందని, అల్లరి మూకల నుంచి తమను కాపాడాలని కంట్రోల్ రూమ్ కు వేల సంఖ్యలో కాల్స్ చేశారు. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు తమను రక్షించాలంటూ మంగళవారం ఒక్క రోజే 7,500 ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతకుముందు రోజు సోమవారం 3,500 మంది, తర్వాత బుధవారం 1,500 మంది పోలీసులకు ఫోన్లు చేశారు.

ఆదివారం నుంచీ మొదలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీ పర్యటనకు వచ్చిన సమయం నుంచీ ఆందోళనలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి హింసాత్మక రూపం సంతరించుకున్నాయి. ఆ రోజు రాత్రి కంట్రోల్ రూమ్ కు 7‌‌00కు పైగా కాల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఇవన్నీ కూడా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల నుంచే వచ్చాయని.. తమ ఇళ్లపై దాడి చేస్తున్నారని, తగలబెడుతున్నారని ఫిర్యాదు చేశారని వెల్లడించారు.


More Telugu News