ఢిల్లీ యువతి కడుపుపై తన్నిన ఆందోళనకారులు... 'మిరాకిల్ బేబీ' జననం!

  • అర్థరాత్రి ఇంటిపై దాడి చేసిన అల్లరి మూక
  • ఇంటిని తగులబెట్టి, దాడికి పాల్పడిన నిరసనకారులు
  • బుధవారం నాడు బిడ్డను ప్రసవించిన పర్వీనా
గర్భవతిగా ఉన్న ఓ యువతిపై దాడికి దిగిన నిరసనకారులు, ఆమె కడుపులో బలంగా తన్నగా, నొప్పులు మొదలై, ఓ బిడ్డను ఆమె ప్రసవించింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డను వైద్యులు 'మిరాకిల్ బేబీ'గా ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని కరావాల్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, పర్వీనా (30) అనే యువతి ఫ్యామిలీ ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది.

ఆమె ఇంటిపై దాడి చేసిన కొందరు నిరసనకారులు, ఇంటిని తగులబెట్టారు. పర్వీన్ ను, ఆమె భర్తను దారుణంగా హింసించారు. ఆమె గర్భవతని కూడా చూడకుండా కడుపులో తన్నారు.  సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

"మా ప్రాంతంలో మత విద్వేషాలు వెల్లువెత్తాయి. నా కుమారుడిని, కోడలిని కొట్టారు. కోడలు కడుపులో బలంగా తన్నారు. నేను కాపాడేందుకు వెళితే నాపై కూడా దాడి చేశారు. ఆ రాత్రి ఎలా తెల్లారుతుందోనని ఎంతో భయపడ్డాం. దేవుడి దయవల్ల ప్రాణాలతో తప్పించుకోగలిగాము" అని పర్వీన్ అత్త నసీమా పీటీఐకి వెల్లడించారు.

ఆ వెంటనే నొప్పితో బాధపడుతున్న పర్వీన్ ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళితే, పరిస్థితి విషమంగా ఉందని, హింద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారని, ఆసుపత్రిలో బుధవారం పండంటి బిడ్డ పుట్టాడని అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన తరువాత ఎక్కడికి వెళ్లాలో తమకు అర్థం కావడం లేదని నసీమా వాపోయారు. తాము సర్వస్వాన్నీ కోల్పోయామని, ఏమీ మిగల్లేదని, ఎవరైనా బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కాగా, ఇప్పటివరకూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 38 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులు ఇళ్లను, షాపులను, వాహనాలను తగులబెట్టారు. ఓ పెట్రోల్ బంక్ ను ధ్వంసం చేశారు. ముఖ్యంగా జఫ్రాబాద్, మౌజ్ పూర్, బాబర్ పూర్, యమునా విహార్, భజన్ పురా, చంద్ బాగ్, శివ్ విహార్ ప్రాంతంలో అల్లర్లు అధికంగా జరిగాయి.


More Telugu News