త్వరలోనే విశాఖ వెళతా...ఎవరు ఆపుతారో చూస్తా: టీడీపీ అధినేత చంద్రబాబు

  • త్వరలోనే పర్యటన ఖరారు
  • ఎన్నిసార్లు అడ్డుకుంటారో నేనూ చూస్తా
  • నిన్నటి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్న యోచన
త్వరలోనే తన విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారవుతుందని, ఎన్నిసార్లు తనను అడ్డుకుంటారో నేనూ చూస్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తిలోని భూ బాధితులను పరామర్శించి అనంతరం ఎల్‌.కోట, ఎస్‌.కోట మండలాల మీదుగా విజయనగరం వెళ్లేందుకు నిన్న చంద్రబాబు విశాఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం టీడీపీ నాయకులు ముందుగానే అనుమతి తీసుకున్నారు. కానీ వైసీపీ శ్రేణులు విమానాశ్రయంలోనే బాబును అడ్డుకున్నారు.

దాదాపు ఐదు గంటల హైడ్రామా అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విశాఖ పర్యటనకు వెళ్లకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

ఇలా ఎన్నిసార్లు ఆటంకాలు సృష్టిస్తారో తానూ చూస్తానన్నారు. అనుమతి తీసుకున్న పర్యటనను అడ్డుకోవడం ఏమిటని, వైసీపీ శ్రేణుల తీరు చూస్తుంటే పోలీసుల పరోక్ష సహకారం ఉందని ఆరోపించారు. కాగా, నిన్నటి వ్యవహారంపై టీడీపీ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.


More Telugu News