ఫ్లెక్సీ కడుతూ, వైఎస్ జగన్ చిన్నప్పటి క్లాస్ మేట్ దుర్మరణం!

  • జగన్ తో కలిసి చదువుకున్న జగదీశ్
  • అప్పటి చిత్రాలతో భారీ ఫ్లెక్సీ 
  • కడుతూ ఉంటే విద్యుదాఘాతం
  • అనకాపల్లిలో ఘటన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకోవాలన్న తాపత్రయం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీశ్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీశ్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు.

అప్పడు తాము తీయించుకున్న చిత్రాలు, జగన్ పాదయాత్రలో పాల్గొన్న చిత్రాలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించారు. దానిని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి పైకి ఎక్కాడు. ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ఫ్లెక్సీ కాస్తా ఇంటి ముందే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మిగల్లేదు.


More Telugu News