ఐబీ అధికారి హత్యకేసులో ఆరోపణలు.. తమ పార్టీ నేత తాహిర్ హుస్సేన్‌పై వేటేసిన కేజ్రీవాల్

  • ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య
  • ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై కేసు నమోదు
  • పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేజ్రీవాల్
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్‌శర్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అంకిత్‌శర్మ దారుణహత్యకు గురయ్యారు. చాంద్‌‌బాగ్ ప్రాంతంలోని ఓ కాలువ నుంచి ఆయన మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన హత్యకు తాహిరే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో దయాళ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై 302 సెక్షన్ కింద కేసు నమోదైంది.

ఈ హత్య వెనక తాహిర్ ఉన్నాడని అంకిత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను తాహిర్ ఖండించారు. నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం చాంద్‌బాగ్ అల్లర్లకు కేంద్రాలుగా మారినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది మంది పెట్రోలు, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేజ్రీవాల్ తాహిర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నిన్న రాత్రి ప్రకటించారు.


More Telugu News