రెండు వేల నోట్లు ఇవ్వొద్దని ఎవరికీ చెప్పలేదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • దేశవ్యాప్తంగా రెండు వేల నోట్లకు కొరత
  • ఏటీఎంలో వస్తున్నవి కేవలం రూ.500 లోపు కరెన్సీయే
  • రెండు వేల నోట్లు రద్దవుతాయనే ప్రచారం  
తనకు తెలిసినంత వరకు రెండు వేల నోట్లను ఇవ్వొద్దంటూ బ్యాంకులకు సూచనలేమీ వెళ్లలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రెండు వేల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉంటాయని, అవి రద్దవుతాయన్నది కేవలం వదంతి మాత్రమేనని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. రెండు వేల నోట్ల జారీని నిలిపివేయాల్సిందిగా తామైతే బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.

నోట్లు రద్దవుతాయంటూ ప్రచారం

దేశంలో రెండు వేల నోట్లను రద్దు చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అటు బ్యాంకుల్లోనూ రెండు వేల నోట్లు కాకుండా రూ.500 నోట్లే ఎక్కువగా ఇస్తున్నారు. ఏటీఎంలలో కూడా చాలా వరకు 500, 200, 100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే నోట్ల రద్దు ఉండవచ్చన్న ఊహాగానాలు చెలరేగాయి.

నోట్లు ఇవ్వడం లేదన్న ఇండియన్ బ్యాంక్

  • ఇప్పటికే ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ ఈ  తరహా ప్రకటన చేసింది. తమ ఏటీఎంలలో రెండు వేల నోట్లను వినియోగించడం లేదని ఇటీవల వెల్లడించింది.
  • మరోవైపు రిజర్వు బ్యాంకు కూడా సుమారు 18 నెలలుగా రెండు వేల నోట్లను ముద్రించడం లేదని ఇటీవల సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించింది. దీంతో రెండు వేల నోట్ల రద్దుపై సందేహాలు ముసురుకున్నాయి.


More Telugu News