స్విగ్గీ, జొమాటోలకు పోటీగా అమెజాన్​ ఫుడ్​ డెలివరీ సర్వీస్​!

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా అమెజాన్​ ఫుడ్​ డెలివరీ సర్వీస్​!
  • ఇప్పటికే ప్రైమ్, అమెజాన్ నవ్ సర్వీసుల ద్వారా కిరాణా, కూరగాయల డెలివరీ
  • ఫుడ్ డెలివరీపైనా బెంగళూరులో టెస్టింగ్ జరుగుతోందన్న మార్కెట్ వర్గాలు
  • భారీగా పోటీ ఉండటంతో దీనిపై అందరి ఆసక్తి
ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద కంపెనీ అమెజాన్ భారత్ లో స్విగ్గీ, జొమాటో వంటి వాటికి పోటీగా ఫుడ్ డెలివరీ సర్వీసును ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, అమెజాన్ నవ్ సర్వీసుల ద్వారా ఇంటింటికీ కిరాణా సరుకులు, కూరగాయలు, పౌల్ట్రీ ఉత్పత్తులు సరఫరా చేస్తున్న అమెజాన్.. ఇక ఫుడ్ డెలివరీ బిజినెస్ పైనా దృష్టి పెట్టినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

బెంగళూరులో టెస్టింగ్ కూడా..

అమెజాన్ కంపెనీ బెంగళూరులో ఇప్పటికే ఫుడ్ డెలివరీ సర్వీసును పరీక్షిస్తోందని, ఇప్పటికే మార్కెట్లోకి లాంచింగ్ కావాల్సి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నాయి.

ఇప్పటికే తీవ్రంగా పోటీ

భారత్ లో ఫుడ్ డెలివరీ మార్కెట్ లో ఇప్పటికే తీవ్రంగా పోటీ ఉంది. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో సంస్థలు టాప్ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. గతంలో ఈ రెండింటితోపాటు ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా, మరో రెండు, మూడు కంపెనీలు రంగంలో ఉండేవి. ఫాసూస్, డోమినోస్, ఈట్.ఫిట్, హెలో కర్రీ వంటి కొన్ని సంస్థలు తమ కంటూ స్పెషల్ యాప్ లు, ఫ్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.

పోటీ పెరగడంతో డిస్కౌంట్లు, స్పెషల్ సబ్ స్క్రిప్షన్లు

ఫుడ్ డెలివరీలో పోటీ చాలా ఎక్కువగా ఉండటంతో పెద్ద కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో చిన్న కంపెనీలూ డిస్కౌంట్లు ఇవ్వక తప్పలేదు. కొంత కాలం తర్వాత చిన్న కంపెనీలు డిస్కౌంట్ల భారాన్ని మోయలేక, కస్టమర్లు తగ్గిపోవడంతో వెనుకబడిపోయాయి. స్విగ్గీ, జొమాటో మాత్రం గట్టిగా బరిలో ఉన్నాయి. ఇటీవలే ఉబర్ ఈట్స్ సంస్థ జొమాటోలో విలీనమైంది కూడా.

కొత్తగా పోటీలోకి బడా కంపెనీ

ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులోకి వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. అమెజాన్ వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలదని, మార్కెట్ పరిస్థితులను తట్టుకోగలదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రైమ్, నవ్ ప్లాట్ ఫామ్ ల సాయంతో ఫుడ్ డెలివరీ బిజినెస్ ను చేజిక్కించుకోగలదని అంటున్నారు.


More Telugu News