ఇండోనేషియాలో భారీ వరదలు.. నీట మునిగిన ప్రెసిడెంట్​ ప్యాలెస్​

  • వరదలో మునిగిపోయిన రాజధాని జకర్తా
  • చాలా చోట్ల ఐదు అడుగుల లోతు నీళ్లు
  • సైన్యాన్ని దింపి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆ దేశ రాజధాని జకర్తా మునిగిపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడి బయటికి పోశారు. చాలా ప్రాంతాల్లో రవాణా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. లక్షల మంది జనం వరద నీటిలో చిక్కుకుని తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.

రెండు రోజులుగా..

సోమవారం రాత్రి నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వానలతో ఇండోనేషియాలో చాలా నదులు పొంగిపొర్లుతున్నాయని, దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయని నేషనల్‌ డిజాస్టర్‌‌ మిటిగేషన్‌ ఏజెన్సీ అధికార ప్రతినిధి విబోవా చెప్పారు. దాదాపు ఐదు అడుగుల మేర నీళ్లు చేరాయని ఆయన తెలిపారు. చాలా మందిని ఇళ్ల నుంచి సహాయక కేంద్రాలకు తరలించామని ప్రకటించారు. ఇక కరెంట్‌ సప్లై లేకపోవడం, ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడం వంటి వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.

మరో రెండు వారాలు వానలు

రెండు వారాలపాటు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఇండోనేషియా వాతావరణ శాఖ అంచనా వేసింది. జకార్తాను మునిగిపోతున్న నగరంగా చెప్తారు. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం ఏటేటా కొద్ది కొద్దిగా కుంగిపోతోంది. ఇక్కడ తరచూ కొండచరియలు విరిగిపడటం, భూకంపాలు, వరదలు రావడం సాధారణంగా మారింది. దీంతో ఇక్కడి నుంచి రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు కూడా.


More Telugu News