ఏపీకి తగిన సాయం చేయండి.. ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు ఏపీ సీఎం జగన్​ విజ్ఞప్తి

  • తాము చేపడుతున్న కార్యక్రమాలు గ్రామాల స్వరూపాన్నే మార్చేస్తాయని వివరణ
  • అమరావతిలోని సచివాలయంలో సమావేశం
  • ఏపీలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై చర్చ
తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల స్వరూపాన్నే మార్చివేస్తాయని ఏపీ సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయడానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

అమరావతిలో భేటీ..

మంగళవారం ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్ బర్న్ బెంజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితిని జగన్ వారికి వివరించారు. ఈ సమావేశానికి సంబంధించి సీఎం కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

గ్రామాల్లోనే అన్నీ..

ఏపీలో గ్రామ స్థాయిలోనే అనేక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టు జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. గ్రామ స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజీ క్లినిక్ వంటివి ఏర్పాటు చేశామని.. అవి గ్రామాల స్వరూపాన్నే మార్చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బోధనాస్పత్రులను పెంచుతున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయనున్నామని వివరించారు.

అమరావతికి లక్ష కోట్లకుపైగా కావాలి

విజయవాడ, గుంటూరు మధ్య అమరావతిలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం భారీగా నిధులు అవసరం అవుతాయని జగన్ పేర్కొన్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున మొత్తంగా లక్ష కోట్ల పైన అవసరమన్నారు. గత ఐదేళ్లలో అమరావతిపై రూ. 5,674 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. అందువల్లే అగ్రశ్రేణి నగరంగా ఉన్నా విశాఖపట్నంతోపాటు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

నాలుగు నెలలు పరిశీలిస్తామన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

విద్య, వైద్యం, సామాజిక భద్రత తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా సాయం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జగన్ కు హామీ ఇచ్చారు. వచ్చే నాలుగు నెలల పాటు అధికారులతో కలిసి పనిచేసి, ఏ కార్యక్రమాలకు సాయం అందించాలన్న దానిపై అవగాహనకు వస్తామని తెలిపారు.


More Telugu News