కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి భూములపై కలకలం.. తహసీల్దార్‌ సస్పెన్షన్‌.. స్పందించిన రేవంత్‌రెడ్డి

  • రంగారెడ్డి జిల్లా గోపనపల్లి పరిధిలో అక్రమ మ్యుటేషన్లు
  • తప్పుడు పత్రాల ఆధారంగా మ్యుటేషన్‌
  • శేరిలింగంపల్లి మాజీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు
  • భూమిని రేవంత్ రెడ్డి మ్యుటేషన్లు చేయించుకున్నారని ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా గోపనపల్లి పరిధిలో సర్వే నంబర్‌ 127లో అక్రమ మ్యుటేషన్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చి, పలు కీలక వివరాలు తెలిపారు. తప్పుడు పత్రాల ఆధారంగా మ్యుటేషన్‌ చేసిన శేరిలింగంపల్లి మాజీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలకు సిఫారసు చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పేర్ల మీద 6.24 ఎకరాల భూమిని మ్యుటేషన్లు చేయించుకున్నారని ఆరోపణలున్నాయి.

దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ... తాము రికార్డులను ట్యాంపరింగ్‌ చేశామనడం అసత్యమని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. వచ్చాక దీనిపై పూర్తిగా స్పందిస్తానని చెప్పారు.

భూములను 2005లో కొనుగోలు చేస్తే, 1978లో రికార్డులు ఎలా ట్యాంపర్‌ చేస్తామని నిలదీశారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ ఈ భూములపై ఇటువంటి ఆరోపణలే చేశారని తెలిపారు. తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా, శేరిలింగంపల్లి మాజీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మ్యుటేషన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


More Telugu News