ట్రంప్‌ విమానం దిగగానే 'చంద్రబాబు ఎక్కడా?' అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది!: ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్

  • సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చూస్తున్నాను
  • చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా? అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం 
  • చంద్రబాబును జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుంది 
భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటిస్తోన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఇది సరికాదని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చూస్తున్నానని ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌ అహ్మదాబాద్‌లో నిన్న విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా? అని అడిగినట్లు సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

అలాగే, చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా? అని ట్రంప్‌ అడిగినట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుందని ఆయన చురకలంటించారు.  గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుందని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు నాయుడే తన గురించి గొప్పలు చెప్పించుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ప్రచారం చేయించుకోవడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? అని విమర్శించారు.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ను, కేంద్రంలో మోదీని ఓడిస్తానని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తే ఆయనను ప్రజలు ఘోరంగా ఓడించారని అన్నారు. మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని చంద్రబాబు అంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపారని ఆరోపించారు.


More Telugu News