జపాన్​ షిప్​ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్​.. చైనాలో 2,663కు పెరిగిన మృతుల సంఖ్య

  • చైనాలో మంగళవారం మరో 71 మంది మృతి
  • దక్షిణ కొరియాలో కోరలు చాస్తున్న వైరస్.. ఇప్పటికే వెయ్యి మందికి వ్యాప్తి
  • అక్కడ జరగాల్సిన టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్ వాయిదా
జపాన్ సముద్ర తీరంలో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్ సోకింది. వీరితో కలిపి వైరస్ బారినపడ్డ ఇండియన్ల సంఖ్య 14కు చేరినట్టుగా జపాన్ లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. వారందరికి తగిన చికిత్స అందజేస్తున్నారని, కోలుకుంటున్నారని పేర్కొంది. కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ సోకిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని, వైరస్ నియంత్రణ ఏమేరకు ఉందన్నది పరిశీలిస్తామని డాక్టర్లు తెలిపారు.

చైనాలో మరో 71 మంది మృతి

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. సోమవారం అర్ధరాత్రి వరకు కొత్తగా 508 కేసులు నమోదైనట్టు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. అయితే వైరస్ బారినపడిన వారిలో సోమవారం 71 మంది మృతి చెందినట్టు తెలిపింది. మొత్తంగా చైనాలో కరోనా మృతుల సంఖ్య 2,663కు పెరిగిందని పేర్కొంది. ఇక వైరస్ ఉద్ధృతి కారణంగా చైనా పార్లమెంటు సమావేశాలను కూడా వాయిదా వేసుకుంది.

దక్షిణ కొరియాను భయపెడుతున్న వైరస్

చైనాకు పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ ఇప్పటికే వెయ్యి మందికిపైగా వైరస్ బారినపడినట్టు గుర్తించారు. ముఖ్యంగా దక్షిణ కొరియాలోని నాలుగో పెద్ద పట్టణం అయిన డేగూ పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ప్రభుత్వ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జీఇన్ మంగళవారం ప్రకటించారు.

టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్ వాయిదా

దక్షిణ కొరియాలో మార్చి 22వ తేదీ నుంచి టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్ టోర్నీ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ తేదీలను జూన్ 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.


More Telugu News