ఆయుధాలు అమ్మడానికా మీరు ఇండియా వెళ్లింది.. ట్రంప్ పై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ ఫైర్
దానివల్ల ఆయుధ కంపెనీలకే లాభం జరుగుతుంది
దానికి బదులు వాతావరణ మార్పులపై పోరాటం, ఉద్యోగాల కల్పనపై పనిచేయాలని సూచన
డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న బెర్నీ శాండర్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన తీరు పట్ల అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ మండిపడ్డారు. ట్రంప్ ఆయుధాలు అమ్ముకోవడానికి ఇండియా వెళ్లారా? అని నిలదీశారు. దానికి బదులు వాతావరణ మార్పులపై పోరాటం, కాలుష్యాన్ని తగ్గించడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ఒప్పందాలు చేసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
ఆయుధాల కంపెనీలకే లాభం
ఆయుధాల అమ్మకాలు, ఒప్పందాల వల్ల అమెరికాలోని ఆయుధాల కంపెనీలకే లాభమని బెర్నీ శాండర్స్ అన్నారు. ‘‘రూ.21 వేల కోట్ల విలువైన ఆయుధాలు, యుద్ధ హెలికాప్టర్లు వంటివి ఇండియాకు అమ్మడం వల్ల అమెరికాలోని రేథాన్, బోయింగ్, లాక్ హీడ్ వంటి పెద్ద పెద్ద కంపెనీలకే లాభం. అమెరికా ఇండియాతో కలిసి వాతావరణ మార్పులపై పోరాడాలి. గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, పునరుత్పాదక ఇంధన వనరులపై కలిసి పనిచేయాలి. మన భూమిని కాపాడుకోవాలి” అని మంగళవారం ట్వీట్ చేశారు.
డెమొక్రాట్ల తరఫున ప్రెసిడెంట్ రేసు కోసం..
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అందులో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు బెర్నీ శాండర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున తిరిగి బరిలో ఉండేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిపబ్లికన్ల తరఫున తిరిగి ట్రంప్ నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెమొక్రాట్లలో మాత్రం పోటీ ఉంది. ఒకవేళ బెర్నీ శాండర్స్ కు అవకాశం వస్తే.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో తలపడతారు.