ఘోర ఓటమికి కోహ్లీయే కారణం.. మాజీ క్రికెటర్ మంజ్రేకర్ కామెంట్

  • విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు
  • రెండు ఇన్నింగ్స్ లలో త్వరగా ఔటవడంతో న్యూజిలాండ్ కు కలిసొచ్చింది
  • బ్యాట్స్ మన్ ఎవరూ అటాకింగ్ గా నిలవలేకపోయారని వ్యాఖ్య
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యమే కారణమని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. కోహ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడని, రెండు ఇన్నింగ్స్ లలోనూ త్వరగా ఔటయ్యాడని పేర్కొన్నారు. ఒకవేళ కోహ్లీ బాగా ఆడి, ఎక్కువ పరుగులు చేసి ఉంటే టీమిండియా పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పారు. న్యూజిలాండ్ జట్టు తమ ప్లాన్ ను కచ్చితంగా అమలు చేసిందన్నారు. టీమిండియా నుంచి కౌంటర్ అటాకింగ్ చేయడానికి ఎవరూ నిలవలేకపోయారని, బ్యాట్స్ మన్ అంతా చేతులెత్తేశారని పేర్కొన్నారు.

న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ అంతంతే..!

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తొలివన్డేలో చేసిన హాఫ్ సెంచరీ తప్ప.. టీ20 మ్యాచ్ లు, వన్డేలు, టెస్టు దేనిలోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. నాలుగు టీ20 మ్యాచుల్లో వరుసగా 45, 11, 38, 11 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లోనూ 51, 15, 9 రన్స్, తొలి టెస్టులో 2, 19 రన్స్ మాత్రమే సాధించాడు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే తాను బాగానే ఆడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. దీర్ఘకాలంగా ఆడుతుండటంతో కొన్నిసార్లు రెండు, మూడు ఇన్నింగ్స్ లో ఆశించినంతగా రన్స్ రాకపోవచ్చన్నాడు.


More Telugu News