మలేసియా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు... పదవికి రాజీనామా చేసిన ప్రధాని

  • ప్రధాని పదవి నుంచి తప్పుకున్న మహతీర్ మహ్మద్
  • ప్యాక్ట్ ఆఫ్ హోప్ సంకీర్ణంలో విభేదాలు
  • అన్వర్ ఇబ్రహీంకు పెరుగుతున్న వ్యతిరేకత
  • అన్వర్ ను అధికారం చేపట్టనివ్వరాదని భావిస్తున్న మహతీర్ మహ్మద్
మలేసియా రాజకీయాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతగా అనిశ్చితిలో పడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అన్వర్ ఇబ్రహీంను అధికారంలోకి రాకుండా నిరోధించే ఎత్తుగడల్లో భాగంగా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ మహతీర్ తన అనుయాయులతో కలిసి కొత్త సంకీర్ణం ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

2018లో అప్పటి ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు రాగా... మహతీర్ మహ్మద్, అన్వర్ ఇబ్రహీం తమ విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నెగ్గిన విజేతలు ప్యాక్ట్ ఆఫ్ హోప్ పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అధికార పగ్గాలు అన్వర్ ఇబ్రహీంకు అప్పగిస్తానని నాడు మహతీర్ మహ్మద్ మాటిచ్చారు.

అయితే, ఆయన హామీకి నిర్దిష్ట కాలావధి అంటూ ఏదీ పేర్కొనలేదు. దీంతో మహతీర్ మహ్మద్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో సంకీర్ణంలో అన్వర్ ఇబ్రహీంకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. ఇదే అదనుగా ప్రధాని మహతీర్ మహ్మద్ ఆ వ్యతిరేకులందరితో కలిసి కొత్త సంకీర్ణం ఏర్పాటు చేయాలని వ్యూహరచన చేశారు. ఇప్పుడా వ్యూహంలో భాగంగానే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అన్వర్ ఇబ్రహీంను అధికారంలోకి రానివ్వరాదన్నదే మహతీర్ మహ్మద్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.


More Telugu News