ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్ ఫ్లూ.. కేసుల విచారణ పరిస్థితిపై సమీక్షిస్తున్న చీఫ్ జస్టిస్

  • కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షల కోసం డిస్పెన్సరీ ఏర్పాటు
  • వివరాలు వెల్లడించిన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
  • దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న స్వైన్ ఫ్లూ వైరస్
సుప్రీంకోర్టులో ఆరుగురు న్యాయమూర్తులు స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. దీంతో చాలా కేసుల విచారణ వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మంగళవారం వెల్లడించారు. పరిస్థితిపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సమీక్షిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రాంతంలో స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో ప్రభుత్వం కోర్టు ఆవరణలోనే ప్రత్యేకంగా ఒక డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తోంది. జడ్జీలు, లాయర్లు, విజిటర్లకు పరీక్షలు చేయడంతోపాటు వ్యాక్సిన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసుల పరిస్థితిపై సమీక్ష

ఆరుగురు జడ్జీలు స్వైన్ ఫ్లూ బారిన పడటంతో పలు కీలక కేసుల విచారణపై ప్రభావం పడనుందని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. ఈ విషయంపై చీఫ్ జస్టిస్ తో కొందరు జడ్జీలు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సమావేశమై సమీక్షిస్తున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న స్వైన్ ఫ్లూ

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరులోని ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ సోకడంతో జర్మన్ సాఫ్ట్ వేర్ కంపెనీ శాప్ (SAP) ఇండియాలోని తమ ఆఫీసులను మూసివేసింది. ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయాలని ఆదేశించింది.


More Telugu News