ట్రంప్ వెళ్లిపోయే వరకు మేం ప్రశాంతంగానే ఉంటాం... ఆ తర్వాత మేమేంటో చూపిస్తాం: ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా

  • ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ధర్నాలు, నిరసనలు
  • నిరసనకారులను పంపించేసి రోడ్లను క్లియర్ చేయాలన్న బీజేపీ నేత
  • పోలీసుల వల్ల కాకపోతే మూకుమ్మడిగా రోడ్లపై పడతామని వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలు తీవ్రస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి జఫ్రాబాద్ సమీపంలోని మౌజాపూర్ లోనూ ధర్నాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. రోడ్లపై ధర్నాలకు పాల్పడుతున్నవారిని అక్కడ్నించి పంపించేయాలి అంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ పర్యటన కొనసాగుతున్నందున తాము మౌనంగా ఉన్నామని, ట్రంప్ భారత్ నుంచి వెళ్లిపోయాక తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు.

రోడ్లపై సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోకపోతే, ఇంకెవరు చెప్పినా వినిపించుకోమని, మూకుమ్మడిగా రోడ్లపై పడతామని పేర్కొన్నారు. 'నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడం ద్వారా 35 లక్షల మందిని నిరోధించాలనుకుంటున్నారు. నిరసన తెలిపే విధానం ఇదేనా?' అంటూ కపిల్ మిశ్రా మండిపడ్డారు. గతంలో ఆమ్ ఆద్మీ సర్కారులో మంత్రి పదవి కూడా చేపట్టిన కపిల్ మిశ్రా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.


More Telugu News