కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి మోదీయే నిదర్శనం: ట్రంప్ ప్రశంసల వర్షం

  • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో నాకు స్వాగతం పలికారు
  • పేదరికం తగ్గుదలలో మోదీ అద్భుత విజయాలు సాధిస్తున్నారు
  • సచిన్‌, కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లు భారత్‌లో ఉన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిజమైన మిత్రుడని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోతెరా మైదానంలో  నిర్వహిస్తోన్న 'నమస్తే ట్రంప్' సభలో ఆయన మాట్లాడారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

అద్భుత విజేతగా భారత్ అభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంలో మోదీకి స్వాగతం పలికామని, ఇప్పుడేమో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో తనకు స్వాగతం పలికారని చెప్పారు. మీ సాదర స్వాగతానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.
 
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి మోదీయే నిదర్శనమని ట్రంప్ అన్నారు. పారిశుద్ధ్యం, పేదరిక తగ్గుదలలో మోదీ అద్భుత విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. భారత్‌ అద్భుతమైన అవకాశాలకు నెలవని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చి తన కలలను సాకారం చేసుకునే దిశగా భారతావని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందన్నారు.

ప్రజల హక్కుల రక్షణలో ఇరు దేశాలకు ఉన్న శ్రద్ధే భారత్, అమెరికాలను స్నేహితులుగా మార్చాయని చెప్పారు. సచిన్‌, కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లు భారత్‌లో ఉన్నారని చెప్పారు. భారత్‌లో ఒక్కో విజయానికి ప్రతీకగా ఒక్కో పండుగ జరుపుకుంటారని ఆయన గుర్తు చేశారు. అమెరికాకు గుజరాతీలు అందించిన సహకారం చాలా గొప్పదని తెలిపారు. ఈ రోజు సాయంత్రం ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శిస్తానని చెప్పారు.


More Telugu News