అమోఘం, అద్వితీయం... ట్రంప్ రాకముందే మొతేరా స్టేడియానికి లక్ష మంది!

  • ఉదయం 8 గంటల నుంచే స్టేడియంలోకి ప్రజలు
  • తనిఖీలు చేసిన తరువాత అనుమతిస్తున్న పోలీసులు
  • సుమారు ఒకటిన్నర లక్ష మంది హాజరయ్యే అవకాశం
ఇండియాలో మరో దేశాధ్యక్షుడు ఎవరికీ లభించనంతటి అపూర్వమైన, అద్భుతమైన ఘన స్వాగతం యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు లభించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియంలో బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్ పాల్గొననుండగా, 1.10 లక్షల మంది సామర్థ్యంతో ఉన్న స్టేడియానికి దాదాపు 1.50 లక్షల మందిని తరలించాలని (గ్యాలరీ కాకుండా మైదానంలో కూర్చునేవారు కూడా కలిపి) బీజేపీ ముందే నిర్ణయించింది.

ఈ ఉదయం 8 గంటల నుంచే స్టేడియంలోకి ప్రజలను అనుమతించడాన్ని ప్రారంభించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరినీ మూడంచెల తనిఖీ తరువాతనే గ్యాలరీల్లోకి పంపించారు. ఇక మైదానంలో కూర్చునే వారిని ఐదంచెల్లో తనిఖీలు చేశారు. మోదీ, ట్రంప్ ప్రసంగించే డయాస్ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లను అమర్చారు. ఇప్పటికే స్టేడియంలో లక్ష మందికి పైగానే ప్రజలు వచ్చి చేరారు. దీంతో ఒక బయటి దేశంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి ఇంత మంది ప్రజలు రావడం ఇదే తొలిసారి కానుంది.


More Telugu News