అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య.. దొంగతనానికి వచ్చి కాల్చి చంపిన దుండగుడు

  • బాధితుడిది హర్యానాలోని కర్నాల్
  • లాస్ ఏంజెలెస్‌లోని ఓ స్టోర్‌లో ఉద్యోగం
  • గత నెలలోనే ఇండియా వచ్చి వెళ్లిన వైనం
అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో భారతీయ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన మణిందర్ సింగ్ సాహి లాస్ ఏంజెలెస్‌లోని ఓ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.

ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ హానీ తలపెట్టని దుండగుడు మణిందర్‌పై మాత్రం కాల్పులు జరిపాడు. అనంతరం డబ్బులు తీసుకుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత నెలలో ఇండియాకు వచ్చిన మణిందర్.. అదే నెల చివరిలో తిరిగి అమెరికా చేరుకున్నాడు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు మణిందర్ సోదరుడు తెలిపాడు.


More Telugu News