ఏసీల ధరలు పెరుగుతున్నాయి!

  • కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనా నుంచి తగ్గిన దిగుమతులు
  • ఎండాకాలం మొదలవుతుండటంతో పెరిగిన డిమాండ్
  • దేశీయ కంపెనీలకూ చైనా నుంచి విడిభాగాలు రాక ఇబ్బందులు
  • కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం పెంచడమూ కారణమే..
అటు కరోనా వైరస్ ప్రభావం, ఇటు ఎండాకాలంతో ఏసీల ధరలు పెరగనున్నాయి. సుమారు ఐదు శాతం మేర ధరలు పెంచే అవకాశం ఉందని ఆయా కంపెనీలు, మార్కెట్ వర్గాల ప్రతినిధులు చెప్తున్నారు. ఎండాకాలం మొదలవుతున్న నేపథ్యంలో డిమాండ్ కూడా పెరుగుతుందని అంటున్నారు.

కారణాలు ఎన్నో..

మన దేశంలో లభించే ఏసీల్లో చాలా వరకు చైనా నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసేవే ఎక్కువ. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏసీల్లో వాడే కంప్రెషర్లు, కంట్రోలర్లు, ఇతర విడిభాగాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటాయి. కొంత వరకు దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నా.. అక్కడ కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో ఇబ్బంది మొదలైంది.

షిప్ లలో తెచ్చే పరిస్థితి లేదు

చైనాలో దాదాపు అన్ని రకాల పరిశ్రమలూ కరోనా వైరస్ కారణంగా మూతపడి ఉన్నాయి. కొంతవరకు నడుస్తున్నవి కూడా జాగ్రత్తల కారణంగా ఉత్పత్తి తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏసీల విడిభాగాల దిగుమతి తగ్గింది. పైగా షిప్పుల ద్వారా దిగుమతులపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో.. విమానాల ద్వారా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి.. మొత్తంగా ఏసీల ధరలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఇప్పటికే చాలా కంపెనీలు

ఎండాకాలం వస్తుండటంతో ఏసీలకు డిమాండ్ ఉంటుంది. కొనుగోళ్లు పెరిగే పరిస్థితిలో ఇప్పటికే ఏసీల తయారీ కంపెనీలు రెండు, మూడు శాతం ధరలు పెంచాయి. చైనా నుంచి దిగుమతులు మొదలుకాకపోతే.. పది శాతం వరకు ధరలు పెంచాల్సి వస్తుందని అంటున్నారు.


More Telugu News