మాఫియా డాన్ రవి పూజారి దొరికాడు.. దక్షిణాఫ్రికాలో పట్టుకున్న కర్ణాటక పోలీసులు
కరుడుగట్టిన ముంబై డాన్ చోటా రాజన్ శిష్యుడే రవి పూజారి
దావూద్ ఇబ్రహీంతోనూ కలిసి దందాలు
అతడిపై 200కుపైగా కేసులు.. కొన్నేళ్ల కిందటే దేశం నుంచి పరారీ
సోమవారం బెంగళూరుకు తీసుకురానున్న పోలీసులు
కరుడుగట్టిన మాఫియా డాన్ రవి పూజారి దక్షిణాఫ్రికాలో కర్ణాటక పోలీసుల చేతికి చిక్కాడు. ఇరవై ఏళ్ల కిందే దేశం నుంచి పారిపోయిన రవి పూజారిపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు, ఇంటలిజెన్స్ సిబ్బంది.. దక్షిణాఫ్రికాలోని ఓ గ్రామంలో మారుపేరుతో ఉన్నట్టుగా గుర్తించారు. అతడి అరెస్టు కోసం వారెంట్ తీసుకుని వెళ్లి.. దక్షిణాఫ్రికా, సెనెగల్ దేశాల పోలీసులతో కలిసి రవి పూజారిని పట్టుకున్నారు. అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని విమానంలో ఇండియాకు బయలుదేరారు. అతడిని పట్టుకున్న టీమ్ లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ వివరాలు వెల్లడించారు.
మరో ఇద్దరు డాన్ లతో కలిసి..
ముంబైని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్లు దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ లతో కలిసి పనిచేసిన కరుడుగట్టిన నేరస్తుడు రవి పూజారి. అతను కర్ణాటకకు చెందినవాడు. ముంబై వెళ్లి తొలుత చోటా రాజన్ దగ్గర చేరాడు. తర్వాత సొంతంగా సెటిల్ మెంట్లు, దందాలకు దిగాడు. ఎందరినో బెదిరించి డబ్బులు గుంజాడు. విచ్చలవిడిగా హత్యలకు కూడా పాల్పడ్డాడు. రవి పూజారిపై మర్డర్, దోపిడీ, బెదిరింపులు వంటి కేసులు 200కుపైగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కళ్లుగప్పి పరారీ
ముంబైలో పాల్పడిన నేరాలకు సంబంధించి ఎన్ఐఏ, సీబీఐ, పోలీసులు రవి పూజారిపై గట్టి నిఘా పెట్టడంతో సుమారు 15 ఏళ్ల కింద విదేశాలకు పారిపోయాడు. తప్పుడు పాస్ పోర్టు సంపాదించి ఆఫ్రికాలోని సెనెగల్ కు చేరాడు. రవి పూజారి అరెస్టు కోసం ఎన్ఐఏ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. నిఘా వర్గాలు అతను సెనెగల్ లో ఉన్నట్టు గుర్తించి సమాచారం ఇచ్చాయి. దాంతో అక్కడి పోలీసులు రవి పూజారిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. మన పోలీసులు అతడిని ఇక్కడికి తీసుకొచ్చే లోగానే మళ్లీ మిస్సయ్యాడు. సెనెగల్ స్థానిక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ పరారై దక్షిణాఫ్రికాకు చేరాడు. అక్కడి ఓ గ్రామంలో మారుపేరుతో ఉంటున్నాడు.
సెనెగల్ పోలీసులను తీసుకుని దక్షిణాఫ్రికాకు వెళ్లి..
రవి పూజారి దక్షిణాఫ్రికాకు చేరాడని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో.. మన పోలీసులు, సెనెగల్ కు వెళ్లారు. అక్కడి నుంచి వారిని తీసుకుని దక్షిణాఫ్రికాలో రవి పూజారి దాక్కున్న గ్రామానికి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా స్థానిక పోలీసుల సహాయంతో అతడిని పట్టుకుని.. సెనెగల్ కు తీసుకెళ్లారు. సెనెగల్ లో నేరస్తుల అప్పగింత ఒప్పందానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. ఇండియాకు పట్టుకుని వస్తున్నారు. సోమవారం బెంగళూరుకు చేరుకుంటారని, ఇక్కడి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ఐఏ, సీబీఐ విచారణకు అప్పగిస్తారని అధికారులు తెలిపారు.