యూపీలోని అలీగఢ్​ లో ఉద్రిక్తంగా మారిన సీఏఏ ఆందోళనలు.. ఇంటర్నెట్​ బంద్​.. భారీగా పోలీసుల మోహరింపు

  • రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. పోలీసుల లాఠీ చార్జి
  • ఒక షాపు, పోలీసుల వాహనం దహనం
  • భారీగా మోహరించిన పారా మిలటరీ బలగాలు
ఉత్తర ప్రదేశ్ లోని  అలీగఢ్ లో సుమారు నెల రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న యాంటీ సీఏఏ ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఆందోళన కారులు, పోలీసుల మధ్య గొడవజరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక దుకాణానికి, పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడుతుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. మొబైల్ ఇంటర్నెట్ ను ఆపివేయించారు. పారా మిలటరీ బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు.

పలువురు ఆందోళనకారులు, పోలీసులకు గాయాలు

ఆందోళనకారుల రాళ్లదాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రతిగా పోలీసులు లాఠీ చార్జి చేయడంతో చాలా మంది ఆందోళనకారులకు దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని, హింసకు దిగినవారిని చెదరగొట్టామని అలీగఢ్ జిల్లా మెజిస్ట్రేట్ చంద్రభూషణ్ సింగ్ ప్రకటించారు. ఆందోళనకారులను రెచ్చగొట్టడం వెనుక అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఉన్నట్టుగా భావిస్తున్నామని తెలిపారు.


More Telugu News