ఇక ఉత్తర ప్రదేశ్​ పై ఆప్​ దృష్టి.. ఇప్పటికే పని మొదలుపెట్టాం: ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​

  • ఢిల్లీ డెవలప్ మెంట్ మోడల్ తో పోలిస్తే గుజరాత్ మోడల్ ఉత్తదే..
  • యూపీలో గూండా రాజ్ కు చెక్ పెడతామని వ్యాఖ్య
  • 2022 ఎలక్షన్లలో తమ ప్రభావం చూపుతామని వెల్లడి
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఘన విజయంతో ఊపు మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పై దృష్టి పెట్టింది. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాగా వేయడంపై దృష్టి సారించామని ఆప్ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ కు ఢిల్లీ అభివృద్ది మోడల్ చూపించి ఓట్లు అడుగుతామని తెలిపారు.

గుజరాత్ తో పోలిస్తే బెటర్

ఆప్ చేసి చూపించిన ఢిల్లీ అభివృద్ధి మోడల్ తో పోలిస్తే బీజేపీ చెప్పే గుజరాత్ అభివృద్ధి మోడల్ ఉత్తదేనని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తమ అభివృద్ధి ఎజెండాను, ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలను యూపీలో ప్రజలకు వివరిస్తామని, ఇప్పటికే తమ కార్యకర్తలు ఆ పనిలో ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజలు విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని.. యూపీలో కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు.

యూపీలో గూండా రాజ్ నడుస్తోంది

యూపీలో గూండా రాజ్, అరాచకం ప్రబలిపోయిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. ఆ రాష్ట్రంలో ఆప్ మాత్రమే ఉత్తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్నారు. ఢిల్లీ ఎలక్షన్లలో తమ పార్టీ తరఫున యూపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని.. యూపీలో పార్టీని బలోపేతం చేసే పనిని వారికి అప్పగించనున్నామని వివరించారు.


More Telugu News