కాంగ్రెస్​ అత్యవసరంగా ఓ లీడర్​ ను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది: శశిథరూర్​

  • బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ బలపడాలి
  • పార్టీకి పూర్తిస్థాయి నాయకత్వం అవసరమని వ్యాఖ్య
  • ఢిల్లీ అసెంబ్లీ ఓటమి నాటి నుంచి వరుసగా ఇలాంటి కామెంట్లు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు కావాలంటే అత్యవసరంగా ఒక లీడర్ ను వెతుక్కోవాల్సి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్ష స్థానంలో శూన్యత ఉందని, దానిని వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైనప్పటి నుంచి కాంగ్రెస్ లోని పెద్ద లీడర్లు వరుసగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం నేపథ్యంలో శశిథరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దేశానికి కాంగ్రెస్ అవసరం

దేశంలో విభజించి పాలించే రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి భారత దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరమని.. దానికి అధ్యక్షులుగా గాంధీ కుటుంబం వాళ్లు ఉంటారా, మరొకరు ఉంటారా అన్నది తర్వాతి విషయమని శశిథరూర్ పేర్కొన్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ బలపడాలని చెప్పారు.

పూర్తిస్థాయి లీడర్ కావాలి

రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉందని శశిథరూర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్తిస్థాయి నాయకత్వం అవసరమని, ఆ దిశగా అత్యవసరంగా ఓ కొత్త లీడర్ ను వెతుక్కోవాల్సి ఉందని తెలిపారు.


More Telugu News