మరో నాలుగు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా కరోనా పరీక్షలు
కరోనా వ్యాప్తిని నివారించేందుకు డీజీసీఏ చర్యలు
ఇప్పటికే ఆరు దేశాల విమాన ప్రయాణికులకు పరీక్షలు
ఆ జాబితాలోకి నేపాల్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా
దేశంలోకి కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు మరో నాలుగు దేశాలకు చెందిన విమాన ప్రయాణికులకు పరీక్షలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. నేపాల్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
పది దేశాల ప్రయాణికులకు..
ఇప్పటికే చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ దేశాల సంఖ్య పదికి చేరింది. ఈ దేశాల నుంచి విమానాశ్రయాల్లో దిగే ప్రయాణికులకు వెంటనే స్క్రీనింగ్ నిర్వహించి, భారత ఆరోగ్య శాఖ సూచనల మేరకు వాళ్ల నుంచి స్వయం ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.
ప్రయాణ సమయంలో చెప్పాలని సూచన
ఈ విషయాన్ని ఆయా దేశాల ప్రయాణికులకు ప్రయాణ సమయంలోనే తెలియజేయాలని అన్ని విమానసంస్థలకు చెప్పింది. కాగా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, నేపాల్ నుంచి వస్తున్న వారికి ముంబై ఎయిర్ పోర్టులో శనివారం నుంచే స్క్రీనింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు.