తిరుమల కొండపైకి మోనో రైలు... కొండపై ట్రాములు!
- లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు చెప్పిన వైవీ సుబ్బారెడ్డి
- హైదరాబాద్ మెట్రో నుంచి నివేదిక కోరామని వెల్లడి
- పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయన్న వైవీ
పర్వతప్రాంతాలు ఎక్కువగా ఉండే ఆస్ట్రియా తదితర యూరప్ దేశాల్లో రవాణా కోసం మోనో రైలు వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇప్పుడలాంటి రైలు వ్యవస్థనే తిరుమల కొండపైకి ప్రయాణికులను చేరవేసేందుకు వినియోగించాలని టీటీడీ భావిస్తోంది. అంతేకాదు, కొండపై ట్రాము రైళ్లను కూడా ప్రవేశపెట్టాలని తలపోస్తోంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల కొండపై లైట్ మెట్రో, మోనో రైళ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక కోరామని వెల్లడించారు. ప్రస్తుతానికి తాము మోనో రైల్, ట్రామ్ రైల్ వంటి వ్యవస్థలను మాత్రమే పరిశీలిస్తున్నామని, కేబుల్ ఆధారిత రైలు వ్యవస్థపై ఆసక్తి లేదని వివరించారు. కాలుష్య రహిత వాతావరణం కోసం ఈ సరికొత్త రైలు వ్యవస్థలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.