షార్ప్ షూటర్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఎన్ఎస్ జీ కమెండోలు.. ట్రంప్ సెక్యూరిటీ ఏర్పాట్లు చూడండి
- మూడంచెల్లో పకడ్బందీగా భద్రత
- డ్రోన్లతో ఆకాశం నుంచి నిఘా..
- ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఆయన బస చేసే ఐటీసీ మౌర్య హోటల్, ఆయన ప్రయాణించే మార్గాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లు, ఇతర మార్గాల్లో దాడులేమీ జరిగే అవకాశం లేకుండా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు చెందిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు.
పై నుంచి కన్నేసి ఉంటారు
ట్రంప్ ఉండే ప్రాంతంలో చుట్టూ అన్ని ఎత్తైన భవనాలపై స్వాత్ కమెండోలు, షార్ప్ షూటర్లు ఉంటారు. వారు ఆ భవనాలపై నుంచి టెలిస్కోప్ లతో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తూ ఉంటారు. వారి దగ్గర అత్యంత అధునాతనమైన గన్స్ ఉంటాయి. అంత పెద్ద భవనాల పై నుంచి కూడా గురిచూసి కాల్చే సామర్థ్యం వారికి ఉంటుంది.- ఇక ఎన్ఎస్ జీకి చెందిన యాంటీ డ్రోన్ విభాగం, కైట్ వాచర్స్ ఆకాశ మార్గాన దాడులను కనిపెట్టుకుని ఉంటారు.
- హోటల్, ఆ పరిసరాల్లో తనిఖీల కోసం ప్రత్యేకంగా కానైన్ యూనిట్స్ (స్నిఫర్ డాగ్స్)తో పరిశీలిస్తుంటారు.
- ట్రంప్ ప్రయాణించే అన్ని మార్గాల్లో ప్రత్యేక రక్షణ కోసం ఉద్దేశించిన పరాక్రమ్ వాహనాలను మోహరించి ఉంచుతారు.
- మౌర్య హోటల్ నుంచి సర్దార్ పటేల్ మార్గంలో, ఇతర దారుల్లో వందల కొద్దీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
చుట్టూ మూడంచెల భద్రత
ట్రంప్ బస చేసే హోటల్ తోపాటు ఆయన హాజరయ్యే కార్యక్రమాలు, వెళ్లే ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉంటుంది. తొలుత ట్రంప్ చుట్టూ అమెరికాకు చెందిన స్వాత్ కమెండోలు, ఆ దేశ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు రక్షణగా ఉంటారు. తర్వాత మన దేశానికి చెందిన అత్యున్నతమైన ఎన్ఎస్ జీ కమెండోలు కాపలా కాస్తారు. వారికి చుట్టూ మరో వలయంలా సీఆర్పీఎఫ్ తదితర పారా మిలటరీ బలగాలతో రక్షణ ఏర్పాటు చేస్తారు. వీరితోపాటు స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.- ఈ సెక్యూరిటీ కోసం గుజరాత్ లోని ఆరు జిల్లాల నుంచి పోలీసులను, 40 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను రప్పించినట్టు అధికారులు తెలిపారు.
- వందలాది మంది పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో జనంలో కలిసిపోయి పరిస్థితిని పరిశీలిస్తుంటారు.