మూడో రోజూ అదే తీరు.. ఇక రహానె, విహారిపైనే భారం

  • తొలి టెస్టులో ఓటమి దిశగా భారత్ 
  • టాపార్డర్ మళ్లీ ఫెయిల్ 
  • రెండో ఇన్నింగ్స్ లో 144/4తో ఎదురీత
  • న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 348 ఆలౌట్
న్యూజిలాండ్ తో  తొలి టెస్టులో భారత్ కు ఓటమి తప్పేలా కనిపించడం లేదు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో వరుసగా మూడో రోజు కూడా తడబడిన కోహ్లీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం ఇచ్చుకున్న భారత్ .. తర్వాత టాపార్డర్ మరోసారి ఫెయిలవడంతో మూడో రోజు, ఆదివారం ఆట చివరకు రెండో ఇన్నింగ్స్ లో 144/4 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (58) హాఫ్ సెంచరీతో రాణించగా... మరో యువ ఓపెనర్ పృథ్వీ షా (14)తో పాటు చతేశ్వర్  పుజారా (11), కెప్టెన్ విరాట్  కోహ్లీ (19) మరోసారి నిరాశ పరిచారు.

మయాంక్ ను సౌథీ ఔట్ చేయగా.. మిగతా ముగ్గురిని పెవిలియన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్ భారత్ ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానె (25 బ్యాటింగ్), తెలుగు క్రికెటర్ హనుమ విహారి (15 బ్యాటింగ్) పైనే జట్టు భారం ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్ లో భారత్ కేవలం 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి ముందు  కనీసం 200 పైచిలుకు లక్ష్యాన్ని ఉంచితేనే ఈ మ్యాచ్ లో కోహ్లీసేన గట్టెక్కే అవకాశం ఉంటుంది.  సోమవారం రహానె, విహారి ఏ మేరకు పోరాడుతారన్నదానిపైనే  మన జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

కివీస్ భారీ స్కోరు

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 216/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్  (43), అరంగేట్ర ఆటగాడు జెమీసన్ (44), చివరి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ట్రెంట్ బౌల్ట్ (38) అద్భుతంగా పోరాడడంతో కివీస్ 348 పరుగుల వద్ద ఆలౌటై.. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఆట మొదలైన వెంటనే బీజే వాట్లింగ్ (14)ను బుమ్రా, టిమ్ సౌథీ (6)ని ఇషాంత్ త్వరగానే ఔట్ చేసినా.. మిగతా మూడు వికెట్లు తీయడంతో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. టెయిలెండర్ల సహకారంతో గ్రాండ్ హోమ్ ఆతిథ్య జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఓవరాల్ గా ఇషాంత్ ఐదు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు, బుమ్రా, షమీ చెరో వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 165 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.





More Telugu News