సీఎం జగన్​ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్​

  • ప్రత్యర్ధులను, అధికారులను బెదిరించేందుకా సిట్ ఏర్పాటు?
  • అమరావతి, విశాఖకు సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి
  • సిట్-స్టాండ్ కమిటీలతో కాదు జ్యుడిషియల్ విచారణతోనే అది సాధ్యం 
రాజకీయ ప్రత్యర్ధులను, అధికారులను బెదిరించేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకే ‘సిట్–స్టాండ్ కమిటీ‘లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. విశాఖ భూములపై సిట్ నివేదికను పక్కన పెట్టి, మరో సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అమరావతి, విశాఖలపై ఉన్న ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశ్యమే కనుక జగన్ ప్రభుత్వానికి ఉంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే జ్యుడిషియల్ విచారణ ద్వారానే అది సాధ్యం తప్ప, ‘మీ పోలీస్ అధికారులతో వేసిన సిట్-స్టాండ్ కమిటీల వల్ల వాస్తవాలు బయటకి రావు’ అని ప్రజలు భావిస్తున్నారని ధ్వజమెత్తుతూ వరుస ట్వీట్లు చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసుపై ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని, సీబీఐ విచారణ కావాలని జగన్ కు సోదరి వరుస అయ్యే డాక్టరు సునీత హైకోర్టుకు విన్నవించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నిర్దిష్ట అంశాలపైన జ్యూడిషియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు సూచించారు.


More Telugu News