ఆ రూ.100 కోట్ల ఖర్చు ఎవరిది?: ప్రియాంకాగాంధీ

  • ట్రంప్ పర్యటన కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు
  • ఓ కమిటీ ద్వారా ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు
  • ఏ మంత్రిత్వ శాఖ నుంచి ఆ డబ్బు వస్తోంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఈ ఏర్పాట్లపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ, ట్రంప్ పర్యటనకు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని... ఈ సొమ్మును ఒక కమిటీ ద్వారా ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఆ కమిటీలోని మెంబర్లకు కూడా తాము సభ్యులమని తెలియదని విమర్శించారు. ఈ కమిటీకి ఏ మంత్రిత్వ శాఖ నుంచి డబ్బు వస్తోందో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా? అని ప్రశ్నించారు. కీలకమైన విషయాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నిలదీశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మరోవైపు, ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని నాగరిక్ అభినందన్ సమితి అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఓ హిందీ పత్రికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని కూడా ప్రియాంకాగాంధీ షేర్ చేశారు.


More Telugu News