ఢిల్లీ సీఎంకు కేంద్రం షాక్.. మెలానియా ట్రంప్​ కార్యక్రమం లిస్టు నుంచి కేజ్రీవాల్ పేరు తొలగింపు

  • ఢిల్లీ  ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న అమెరికా ప్రథమ మహిళ
  • ఆహ్వానితుల జాబితా నుంచి ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం పేర్లు మాయం
  • కేంద్రం కావాలనే తీసేసిందని ఆప్ ఆరోపణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించే కార్యక్రమానికి ఈ ఇద్దరినీ దూరం పెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత పర్యటనలో భాగంగా  మెలానియా మంగళవారం దక్షిణ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అక్కడ జరిగే ‘హ్యాపీనెస్ క్లాస్’ను చూడనున్నారు. అలాగే, ఓ గంట పాటు పాఠశాల చిన్నారులతో అమెరికా ప్రథమ మహిళ మాట్లాడనున్నారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారం మెలానియాకు ఢిల్లీ  సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానం పలకాల్సి ఉంది. అయితే, ఈ వీవీఐపీ ఈవెంట్ ఆహ్వానితుల జాబితా నుంచి కేజ్రీవాల్, మనీశ్ పేర్లను కేంద్ర ప్రభుత్వం కావాలనే తొలగించిందని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మనీశ్ ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ పాఠ్యాంశం

విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మనీశ్ సిసోడియా రెండేళ్ల క్రితం ‘హ్యాపీనెస్ పాఠ్యాంశం’ ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ప్రతి రోజు 40 నిమిషాల పాటు జరిగే క్లాసులో ధ్యానం, విశ్రాంతితో పాటు ఔట్ డోర్ యాక్టివిటీలు కూడా నిర్వహిస్తారు. తన నియోజకవర్గంలో ఉన్న పాఠశాలను సందర్శించేందుకు మెలానియా ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని అమెరికా రాయబార కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చిందని మనీశ్ తెలిపారు. మెలానియా వస్తారంటే ఆహ్వానిస్తామని చెప్పారు. భారత పర్యటన రెండో రోజు నరేంద్ర మోదీతో డొనాల్ట్ ట్రంప్ చర్చలు జరిగే సమయంలో మెలానియా ఈ పాఠశాలకు వచ్చేలా షెడ్యూల్ చేశారు.

ముందు తిట్టి.. ఇప్పుడు లిస్టులో పెట్టారు

ట్రంప్ పర్యటనలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను చేర్చడమే ఆసక్తికర నిర్ణయం. ఎందుకంటే ఆప్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలు వీడియోలు పోస్టు చేసింది. దాన్ని ఆప్ సర్కారు తిప్పికొట్టింది. స్కూళ్లు బాగా లేవన్న బీజేపీయే ఇప్పుడు మెలనియా ట్రంప్ కు ఆ స్కూళ్ల గొప్పదనాన్ని చూపాలని నిర్ణయించిందని ఆప్ నేతలు పేర్కొంటున్నారు.


More Telugu News