నా కోసం కోటి మంది వస్తారట.. ఆ విషయాన్ని మోదీయే చెప్పారు: ట్రంప్

  • రెండు రోజుల్లోనే 30 లక్షలు పెంచేసిన ట్రంప్
  • అంత లేదంటున్న నెటిజన్లు
  • 1-2 లక్షల మందేనన్న మునిసిపల్ కమిషనర్
భారత పర్యటన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. 70 లక్షల మందితో మోదీ తనకు స్వాగతం పలకబోతున్నారని ఇటీవల చెప్పిన ట్రంప్.. ఇప్పుడా సంఖ్యను ఏకంగా కోటికి పెంచేశారు. తనకు కోటిమందితో స్వాగతం పలకబోతున్న విషయాన్ని స్వయంగా మోదీయే తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తనకు 70 లక్షల మంది స్వాగతం పలకబోతున్నట్టు చెప్పారు. తాజాగా కొలరాడో సభలో ఆయన మాట్లాడుతూ.. మొతేరా స్టేడియానికి వెళ్లే 22 కిలోమీటర్ల దారి పొడవునా కోటిమంది తనకు స్వాగతం పలకబోతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కోటి మంది హాజరయ్యే కార్యక్రమం చూసిన తర్వాత 60 వేల మంది హాజరయ్యే సభలు తనకు సంతృప్తి ఇవ్వలేవని, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ఒకరకంగా తనను చెడగొడుతుందని పేర్కొన్నారు.

ట్రంప్ స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కోటిమంది హాజరైన సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, మోదీ-ట్రంప్ రోడ్డు షోకు రెండు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ పేర్కొన్నారు.


More Telugu News