సూరత్‌లో దారుణం.. ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆసుపత్రికి మహిళా ఉద్యోగులు.. నగ్నంగా నిలబెట్టిన వైద్యులు!

  • పదిమందిని ఒకేసారి పిలిచి నగ్నంగా నిలబెట్టిన వైద్యులు
  • పెళ్లి కాని యువతులకు ప్రెగ్నెన్సీ టెస్టు
  • విచారణకు ఆదేశించిన మునిసిపల్ కమిషనర్
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణ ఘటన జరిగింది. ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ట్రైనీ మహిళా సిబ్బందిని దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. అసభ్యకర ప్రశ్నలతో అవమానించారు. గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనంగా మారింది. దీంతో స్పందించిన మునిసిపల్‌ కమిషనర్‌ బన్‌చానిది పాణి ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 100 మంది యువతులు మూడేళ్ల క్లర్క్ ఉద్యోగ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఉద్యోగం పర్మినెంట్ కావాలంటే ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అన్న నిబంధన ఉంది. దీంతో ఫిట్‌నెస్ పరీక్ష కోసం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వరంలో నడుస్తున్న సూరత్ మునిసిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్ఎంఐఎంఈఆర్)కు వెళ్లారు.

ఒక్కొక్కరికీ విడివిడిగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన గైనకాలజీ వైద్యులు పది మందిని ఒకేసారి పిలిచి దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. పరీక్షలకు వెళ్లిన వారిలో పెళ్లికాని యువతులు కూడా ఉన్నారు. తమను అసభ్యకర ప్రశ్నలు అడగడంతోపాటు  ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా చేశారని యువతులు ఆరోపించారు. విషయం తెలిసిన ఉద్యోగ సంఘాలు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా సిబ్బందిపై వ్యవహరించిన తీరుపై మునిసిపల్ కమిషనర్ బన్‌చానిది పాణికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు.


More Telugu News