అమ్మాయిల జట్టుకు సచిన్, సెహ్వాగ్ అభినందనలు

  • టి20 వరల్డ్ కప్ లో భారత్ మహిళల జట్టు శుభారంభం
  • ఆసీస్ పై 17 పరుగుల తేడాతో విజయం
  • తిరుగులేని విజయం సాధించారంటూ సచిన్ ప్రశంసలు
  • అమ్మాయిలు అదరగొట్టారన్న సెహ్వాగ్
మహిళల క్రికెట్లో అనేక పర్యాయాలు ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించడం మామూలు విషయం కాదు. అది కూడా టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే ఆసీస్ వంటి కఠిన ప్రత్యర్థిని ఓడిస్తే ఆ గెలుపు మజాయే వేరు. ఇప్పుడు టీమిండియా అమ్మాయిలు కూడా అద్భుతమైన విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సిడ్నీలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో భారత్ 17 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తుచేసింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.

టి20 వరల్డ్ కప్ ను తిరుగులేని విజయంతో ప్రారంభించారని సచిన్ కొనియాడారు. అన్ని రంగాల్లో రాణించి, సత్తా చాటారని అభినందించారు. "కంగ్రాచ్యులేషన్స్, మీరు ఇకముందు కూడా ఇలాగే ఆడతారని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. ఇక సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. "ఆహా ఏం విజయం! అమ్మాయిలూ అదరగొట్టారు. 132 పరుగుల స్కోరును కాపాడుకుంటూ ఆస్ట్రేలియాను కుప్పకూల్చడం సామాన్యమైన విషయం కాదు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ వ్యాఖ్యానించారు.


More Telugu News