టి20 వరల్డ్ కప్: భారత అమ్మాయిలు భళా... బలమైన ఆసీస్ ను కంగుతినిపించారు!

  • తొలి మ్యాచ్ లో టీమిండియా బోణి 
  • 17 పరుగుల తేడాతో ఆతిథ్య ఆసీస్ పై ఘనవిజయం
  • 133 పరుగుల లక్ష్యఛేదనలో 115 పరుగులకే కుప్పకూలిన కంగారూలు
టీమిండియా అమ్మాయిలు టి20 వరల్డ్ కప్ లో శుభారంభం చేశారు. సిడ్నీ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో మట్టికరిపించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో గెలుపు ఆశల్లేని భారత జట్టు పూనమ్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో రేసులోకి రావడమే కాదు, ఆతిథ్య ఆసీస్ ను వారి సొంతగడ్డపైనే చుట్టేసింది.

పూనమ్ తన 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి కంగారూల పతనంలో ప్రధాన భూమిక పోషించింది. పూనమ్ కు శిఖా పాండే (3 వికెట్లు) కూడా తోడవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అలీసా హీలీ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మిడిలార్డర్ లో ఆష్లే గార్డనర్ 34 పరుగులు చేయడంతో ఆసీస్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. హీలీ, గార్డనర్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

సొంతగడ్డపై ఆడుతున్న ఒత్తిడి ఈ మ్యాచ్ లో ఆసీస్ అమ్మాయిలపై స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ పేస్ ఎక్కువగా ఎదుర్కొనే ఆస్ట్రేలియన్లను భారత అమ్మాయిలు స్పిన్, పేస్ అస్త్రాలతో కుప్పకూల్చారు.


More Telugu News