కరోనా వైరస్ అన్నది 'దెయ్యం' చర్య.. దక్షిణ కొరియాలో చర్చి లీడర్ వాదన!
ఇది దేవుడిపై నమ్మకానికి పెట్టిన పరీక్ష
చర్చికి చెందిన యాప్ లో పోస్టు
కొరియాలో కొత్తగా 52 మందికి సోకిన కరోనా
చైనాలో మొదలై.. పలు దేశాలకు విస్తరిస్తూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని చైనా చెబుతుంటే.. ఇది చైనా తయారు చేసిన జీవాయుధమని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన ఓ చర్చి లీడర్ మాత్రం తమ దేశంలో కరోనా వ్యాప్తికి కారణం దెయ్యం అంటున్నారు. దేవుడిపై నమ్మకానికి పెట్టిన పరీక్ష ఇదంటూ చెప్తున్నారు.
వైరస్ లక్షణాలు కనిపించడంతో..
1984లో స్థాపించిన షించెయోంగి చర్చి పెద్ద అయిన లీ మన్ హీ తమ చర్చికి వచ్చే చాలా మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో తమ యాప్ లో ఓ పోస్టు పెట్టాడు. తమ చర్చి ఎదుగుదలను ఆపేందుకు దెయ్యమే కరోనాను వ్యాప్తి చేస్తోందన్నారు. దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలని పేర్కొన్నారు.
పెరుగుతున్న బాధితులు
చైనాతోపాటు చుట్టూ ఉన్న దేశాల్లో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చైనాతో దగ్గరగా ఉన్న దక్షిణ కొరియాలోనూ వైరస్ దాడి చేస్తోంది. ఇక్కడ కొత్తగా మరో 54 మందికి కరోనా సోకిందని శుక్రవారం ప్రకటించారు. దాంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 156కు పెరిగింది.