సంతానం లేని నా తల్లిదండ్రులు ఆ దేవుడికి మొక్కుకున్నారు.. దీంతో ఐదుగురం పుట్టాం: మోహన్‌బాబు

  • మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం
  • మా అమ్మానాన్నలకు వివాహమైన తర్వాత ఎన్నో ఏళ్లు సంతానం కలగలేదు 
  • ఎవరో చెప్పారట.. అడవిలో బత్తినీయస్వామిని మొక్కుకుంటే పుడతారని
  • అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు 
శివరాత్రి సందర్భంగా తమ తల్లిదండ్రుల గురించి సినీనటుడు మోహన్‌ బాబు ఆసక్తికర విషయాలు తెలిపారు. 'మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజు. ముఖ్యంగా మా కుటుంబం గుర్తుపెట్టుకోవల్సిన రోజు. ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం' అని అన్నారు.

'మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్లు సంతానం కలగకపోతే ఎవరో చెప్పారట.. ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్న ఈశ్వరునికి  మొక్కుకుంటే పిల్లలు పుడతారని. దీంతో మా తల్లిదండ్రులు ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు. మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు' అని తెలిపారు.

'అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది. అది రహస్యం, నాకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం. ఆయన ఆశీస్సులతో పుట్టినవాడిని నేను, మా కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్లమే. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వ దినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.


More Telugu News