ఇండియాతో అద్భుతమైన, బ్రహ్మాండమైన డీల్ కుదిరే సమయం వచ్చేసింది: డొనాల్డ్ ట్రంప్

  • 24న ఇండియాకు రానున్న ట్రంప్
  • అమెరికా ప్రయోజనాలను పక్కన బెట్టబోము
  • మేలు కలుగుతుందంటేనే డీల్ పై ముందుకు
  • లాస్ వెగాస్ లో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సమయం దగ్గర పడింది. మరో రెండు రోజుల్లో వాషింగ్టన్ నుంచి బయలుదేరే ఆయన, 24న ఇండియాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియాతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని మరోసారి ఆయన వ్యాఖ్యానించారు.

గురువారం నాడు లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ డీల్ చాలా పెద్దదని, బ్రహ్మాండమైన వ్యాపార అవకాశాలను ఇరు దేశాలకూ దగ్గర చేస్తుందని అన్నారు. అయితే, ఈ డీల్ విషయంలో అమెరికా తన ప్రయోజనాలను పక్కన బెట్టబోదని ఓ మెలిక పెట్టారు. ఈ డీల్ అమెరికాకు మేలు చేకూరుస్తుందని భావిస్తేనే ముందుకు వెళతామని, సరైన విధంగా డీల్ లేదనుకుంటే వెనక్కు తగ్గుతామని తెలిపారు.

అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత డీల్ పై ముందడుగు పడుతుందని, ఎప్పుడు ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని అన్నారు. ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడటం ఇది తొలిసారేమీ కాదు. ఇటీవల కూడా ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఈ డీల్ పై ట్రంప్ పాలకవర్గం మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నట్టు సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తన తాజా రిపోర్టులో అభిప్రాయపడింది. యూఎస్ తో వాణిజ్యం విషయంలో ఇండియా వైఖరే సరిలేదని తెలిపింది. ఇదే సమయంలో అమెరికా ఆకాంక్షలకు అనుగుణంగా గత ఐదేళ్ల మోదీ పాలన చేసిందేమీ లేదని పేర్కొంది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేసింది.


More Telugu News