రాజస్థాన్‌లో అమానవీయం.. రూ. 500 చోరీ చేశారని సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన షోరూం నిర్వాహకులు!
- రూ.500 చోరీ చేస్తూ దొరికిన దళిత సోదరులు
- చిత్రహింసలకు గురిచేసిన షోరూం సిబ్బంది
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్ గాంధీ
రాజస్థాన్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ.500 చోరీ చేశారన్న కారణంతో ఇద్దరు దళిత సోదరులను చిత్రవధకు గురిచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగౌర్ జిల్లాలోని ఓ బైక్ షోరూంలో రూ.500 చోరీ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. షోరూం సిబ్బంది వారిని చితకబాదారు. అక్కడితో ఆగకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. స్క్రూ డ్రైవర్‌కు పెట్రోలు పూసి ఓ బాధితుడి జననాంగంలోకి చొప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.