ట్రంప్–మోదీ భేటీలో హెచ్1బీ వీసాలపై చర్చించే చాన్స్: విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్
ఐదు ఒప్పందాలపై చర్చలు, నిర్ణయాలు ఉంటాయి
హెచ్1 బీ పైనా చర్చకోసం ప్రతిపాదించాం
అమెరికా నుంచి అధికారిక సమాచారమైతే రాలేదని వెల్లడి
అమెరికాలో ఉద్యోగాల కోసం అత్యంత కీలకమైన హెచ్1 బీ వీసాల అంశం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇరు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన ఐదు ఒప్పందాలపై ట్రంప్, మోదీ చర్చించి, సంతకాలు చేయనున్నారని తెలిపారు.
హెచ్1బీ వీసాలు మనకు ఎంతో కీలకం
అమెరికాలో సాఫ్ట్ వేర్ సహా చాలా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు హెచ్1 బీ వీసాలు కీలకం. మన దేశానికి ఈ హెచ్1బీ వీసాల కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. మరోవైపు ఈ వీసాలకు దరఖాస్తులు తీసుకునే విషయంపై కొన్ని నియంత్రణలు, పరిమితులు పెట్టాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అధికారిక సమాచారం లేదు
ఈ నేపథ్యంలో ట్రంప్, మోదీ భేటీలో హెచ్1 బీ వీసాల అంశాన్ని చర్చించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రవీష్ కుమార్ చెప్పారు. దీనిపై అమెరికాకు కూడా సమాచారం ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ అంశంపై చర్చ జరుపుతారా? లేదా? అన్నదానిపై అధికారికంగా సమాచారం లేదని వెల్లడించారు.