లేటు వయసులో కొడుకును కనేందుకు ఓ వృద్ధుడి వక్రబుద్ధి!

  • కొడుకును కనాలనుకున్న 64 ఏళ్ల వృద్ధుడు
  • కృత్రిమ గర్భధారణ పద్ధతిలో బిడ్డను కనేందుకు యువతితో ఒప్పందం
  • ఒప్పందాన్ని పక్కనబెట్టి సహజసిద్ధంగా తనతో బిడ్డను కనాలని వేధింపులు
హైదరాబాద్ కు చెందిన స్వరూపరాజ్ వయసు 64 ఏళ్లు. పంజాగుట్ట ప్రాంతంలో ఉండే ఈ వృద్ధుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే ఓ కొడుకు కావాలన్న కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. దాంతో తన ఫ్రెండ్ నూర్ ను సంప్రదించాడు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనవచ్చని, అందుకు ఓ మహిళ అవసరం ఉంటుందని నూర్ చెప్పడంతో స్వరూపరాజ్ సరేనన్నాడు. నగరానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది.

కృత్రిమ గర్భధారణ ద్వారా ఆమె మగబిడ్డను కని స్వరూపరాజ్ కు అప్పగించాలన్నది ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా కాన్పు అయ్యేవరకు నెలకు రూ.10 వేలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఆ యువతి కోరింది. దానికి కూడా స్వరూపరాజ్ అంగీకరించాడు. అయితే ఆ యువతిని ఇటీవల కలిసిన స్వరూపరాజ్ ఒప్పందాన్ని పక్కనబెట్టి సహజసిద్ధంగా పిల్లవాడ్ని కందాం అంటూ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. ఆ వృద్ధుడి వక్రబుద్ధిని పసిగట్టిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వరూపరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్ లో ఈ ఘటన జరిగింది.


More Telugu News