నేషనలిజం పదం వాడొద్దు.. అది నాజీయిజంలా అనిపిస్తోంది: ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​

  • ఛాందసవాదం కారణంగా దేశంలో కొంత అశాంతి ఉంది
  • ఎవరికీ బానిసలం కాదు.. ఎవరినీ బానిసలను చేసుకోబోం
  • భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతేనని వ్యాఖ్య
ప్రజలు నేషనలిజం అనే పదాన్ని వాడొద్దని, ఆ పదం జర్మనీ నియంత హిట్లర్ నాజీయిజాన్ని గుర్తుతెచ్చేలా ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దానికి బదులుగా నేషనాలిటీ అనే పదాన్ని వినియోగించాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, శ్రేణులకు సూచించారు. గురువారం రాంచీలోని ముఖర్జీ యూనివర్సిటీలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫండమెంటలిజం (ఛాందస వాదం)తో అశాంతి

ఛాందసవాదం కారణంగా దేశవ్యాప్తంగా అశాంతి నెలకొందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత భిన్నత్వం ఉన్నా కూడా పౌరులంతా ఒకరితో ఒకరు కలిసి ఉంటున్నారని, ఇది దేశం గొప్పతనమని పేర్కొన్నారు.

 ‘‘దేశంలో ఛాందస వాదం కారణంగా కొంత అశాంతి ఉంది. అయితే ఎవరికీ బానిసలుగా ఉండకపోవడం, ఎవరినీ బానిసలుగా చేసుకోకపోవడమే మన దేశ విధానం. అందరినీ కలిపేలా, అందరూ కలిసుండేలా చేసే ప్రత్యేకత మన దేశానిది. భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతే..” అని మోహన్ భగవత్ చెప్పారు.

ప్రపంచానికే నాయకత్వం వహించాలి..

భారత దేశాన్ని ప్రపంచానికే నాయకత్వం వహించేలా చేయడమే అంతిమ లక్ష్యమని మోహన్ భగవత్ చెప్పారు. దేశాన్ని ఏకీకృతం చేసేందుకు హిందూత్వ ఎజెండాతో మరింత ముందుకు వెళతామన్నారు.


More Telugu News