తమిళనాడులో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం

  • కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటెయినర్ 
  • 23 మందికి గాయాలు
  • బాధితులకు సత్వర సాయం అందించాలంటూ పాలక్కాడ్ కలెక్టర్‌కు కేరళ సీఎం ఆదేశాలు
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సును కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద కంటైనర్ ఢీకొంది. ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిందీ ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

బాధితుల్లో చాలామంది త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. మృతుల్లో బస్సు కండక్టర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధితులకు సత్వర సాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలక్కాడ్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయ చర్యలు చేపడతామని తెలిపారు.


More Telugu News