కరోనా చైనా తప్పిదమేనన్న వాల్ స్ట్రీట్ జర్నల్... ముగ్గురు రిపోర్టర్లను దేశం నుంచి బహిష్కరించిన చైనా!

  • రెండు వేలు దాటిన కోవిడ్ మృతులు
  • 75 వేల మందికి సోకిన వ్యాధి
  • ఈ కామర్స్ సంస్థలకు తెగ గిరాకీ
కోవిడ్-19 (కరోనా వైరస్) మరణమృదంగం కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం, వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2 వేలను దాటింది. బుధవారానికి 2,004 మంది మరణించారని, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 74,185కు చేరిందని చైనా ప్రకటించింది.

ఇక వ్యాధికి చికిత్స అందిస్తున్న వారికి వైరస్ సోకుతూ ఉండటంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కారణంగా ప్రజలంతా తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను ఇంటికే తెప్పించుకుంటున్నారు. దీంతో ఈకామర్స్ సంస్థలకు గిరాకీ తెగ పెరిగింది.

ఇదిలావుండగా కరోనా కట్టడిలో చైనా ఘోరంగా విఫలం అయిందని 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం చైనాకు ఆగ్రహాన్ని తెప్పించింది. 'చైనాయే ఆసియాలో అసలైన రోగి' అంటూ ప్రచురించిన కథనంపై మండిపడిన చైనా, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే, క్షమాపణలు చెప్పేందుకు వాల్ స్ట్రీట్ ససేమిరా అనడంతో, ఆ పత్రికకు చెందిన ముగ్గురు విలేకరులకు చైనా దేశ బహిష్కార దండన విధించింది.


More Telugu News