నితిన్ గడ్కరీకి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి.. ఆయనను కోర్టుకు రమ్మని కోరుతున్నాం: సుప్రీంకోర్టు

  • ఎలక్ట్రిక్ వాహనాలపై పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు
  • ఈ అంశంపై గడ్కరీ తమకు సహకరించాలని సుప్రీం విన్నపం
  • కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆయన ఉన్నారని వ్యాఖ్య
వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా వినూత్నమైన ఆలోచనలను తమతో పంచుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సుప్రీంకోర్టు కోరింది. తమను వచ్చి కలవాలని సూచించింది. ఇవి తాము పంపుతున్న సమన్లు కాదని, కేవలం విన్నపం మాత్రమేనని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీకి సంబంధించిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి ఉందని జస్టిస్ బాబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, నితిన్ గడ్కరీకి సమన్లు జారీ చేస్తున్నట్టుగా తాము భావించడం లేదని... ఇది కేవలం ఒక విన్నపం మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి ఈ అంశంపై స్పందిస్తే బాగుంటుందని... నితిన్ గడ్కరీ వస్తారేమో కనుక్కోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి సూచించారు. నితిన్ గడ్కరీకి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయని, కోర్టుకు వచ్చి తమకు ఈ అంశంపై సహకరించాలని, ఎందుకంటే కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆయన ఉన్నారని చెప్పారు

పిటిషన్ వివరాల్లోకి వెళ్తే, పెట్రోల్, డీజిల్ వాహనాలపై మాత్రమే రుసుమును వసూలు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం సబ్సిడీ ఇవ్వాలని తన పిటిషన్ లో పిటిషన్ దారుడు కోరారు. పిటిషన్ దారుడి తరపున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇతర సమస్యలతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది. వాహనాల శక్తిసామర్థ్యం, పబ్లిక్, ప్రైవేట్ రంగాల వినియోగం.. ఇలా ఎన్నింటితోనే ముడిపడి ఉందని తెలిపింది. పర్యావరణం పరిరక్షణపై ఈ వాహనాలు ఎంతో ప్రభావాన్ని  చూపుతాయని చెప్పింది. అందుకే ప్రతి సమస్యను తాము పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నామని, కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల సహకారాన్ని కోరుతున్నామని తెలిపింది.


More Telugu News