చంద్రబాబు ఉద్దేశం మాకెప్పుడో అర్థమైంది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • విజయవాడలో జర్నలిస్టు సమాఖ్య మీట్ ద ప్రెస్ కార్యక్రమం
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ వ్యాఖ్యలు
  • జగన్ దీర్ఘకాలిక లక్ష్యాలతో పరిపాలిస్తున్నారన్న సజ్జల 
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 'మీట్ ద ప్రెస్' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, జగన్ వచ్చిన తర్వాతే రాష్ట్ర పాలన గాడిలో పడిందని తెలిపారు. అధికారం చేపట్టాక జగన్ కు దారీతెన్నూ లేని అధికార వ్యవస్థ, రుణభారం స్వాగతం పలికాయని, కానీ జగన్ ఎంతో సాహసోపేతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.

చంద్రబాబు రూ.2.60 లక్షల కోట్లు అప్పుల భారం మోపారని, ఒక్క ఆదాయ వనరును కూడా సృష్టించలేకపోయారని విమర్శించారు. వ్యక్తిగత ఖజానా భర్తీ చేసుకోవడం కోసం ప్రజల్లో ఓ భ్రమ కల్పించారని, అమరావతిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబుకు ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. అయితే బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని తమకు ఎప్పుడో అర్థమైందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిపాదనల ప్రకారం ముందుకెళితే లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఒక్క చోటే ఖర్చు చేయడం ఎందుకుని జగన్ వికేంద్రీకరణ వైపు మొగ్గుచూపారని సజ్జల వివరించారు.


More Telugu News