కాసేపట్లో అమిత్ షాతో భేటీకానున్న కేజ్రీవాల్

  • మూడోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించిన కేజ్రీవాల్
  • బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారి అమిత్ షాతో భేటీ
  • సర్వత్ర నెలకొన్న ఆసక్తి
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఆదివారంనాడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి సీఎం అయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేజ్రీవాల్ తొలిసారి భేటీ కాబోతున్నారు. కాసేపట్లో వీరి సమావేశం ప్రారంభంకానుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆప్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

మరోవైపు తన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న మోదీ... కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయారు. అయితే, ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుభాకాంక్షల పట్ల కేజ్రీవాల్ కూడా హుందాగా తన ప్రతిస్పందనను తెలియజేశారు.

'మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు సార్. ప్రమాణస్వీకారానికి మీరు వస్తారని భావించా. మీరు ఎంతో బిజీగా ఉన్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. భారతీయులంతా గర్వించే విధంగా ఢిల్లీ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కలిసి అడుగులు వేద్దాం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 


More Telugu News