బంగారం వ్యాపారినంటూ మహిళలకు బురిడీ... తర్వాత వేధింపులు.. ఫేస్‌బుక్‌ వేదిక!

  • నగలు పంపిస్తానంటూ వల
  • ఆ తర్వాత అశ్లీల చిత్రాలతో వేధింపులు
  • వంద మందికి గాలం వేసిన ఘనుడు
ఫేస్‌బుక్‌ ద్వారా తాను బంగారం వ్యాపారినంటూ పరిచయం చేసుకుని, వలలో చిక్కిన వారికి బంగారు నగలు పంపుతున్నానంటూ ఆశలు రేకెత్తించి, చివరికి వారిని అశ్లీల చిత్రాలతో బ్లాక్‌ మెయిల్‌ చేసే ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏకంగా వంద మందికిపైగా మహిళలు ఇతని వలలో చిక్కుకుని విలవిల్లాడగా ఎట్టకేలకు పాపం పండింది.

పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కలవళ్లకు చెందిన మోదేపల్లి నరేష్‌  (25) డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి మహిళలకు గాలం వేసేవాడు. అనంతరం వారి అడ్రస్‌లు తెలుసుకుని వాట్సాప్‌ మెసేజ్‌లు పంపేవాడు.

బంగారం వ్యాపారినంటూ బిల్డప్ ఇచ్చేవాడు. నగలు ఇస్తానంటూ ఆశ చూపేవాడు. మోడళ్లని చేస్తానంటూ మాయ చేసేవాడు. వాటికోసం మీ ఫొటోలు పంపాలనేవాడు. సాన్నిహిత్యం పెరిగాక తన నగ్నచిత్రాలు పంపేవాడు. మీ ఫొటోలు కూడా పంపాలని ఒత్తిడి చేసేవాడు. ఇలా ఎవరైనా చిక్కితే అవే చిత్రాలు నెట్‌లో పెడతానని బెదిరించి లొంగదీసుకునేవాడు.

కె.ఉప్పలపాడుకు చెందిన ఓ మహిళ ధైర్యం చేసి ఇతనిపై ఫిర్యాదు చేయడంతో ఇతని ఆగడాలకు చెక్‌ పడింది. ఎప్పటికప్పుడు ఫోన్‌ నంబర్లు మారుస్తూ ఏమారుస్తుండడంతో ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులకు నెలరోజుల సమయం పట్టింది.

తీరా పట్టుకునేసరికి ఫోన్‌ నిండా మహిళల నంబర్లే ఉన్నట్లు గుర్తించారు. ఇతని మాయలో వంద మందికి పైగా మహిళలు పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.


More Telugu News