'చనిపోతున్నాం... వెతకొద్దు'... అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మెసేజ్ తో విశాఖలో కలకలం!

  • సోమవారం సాయంత్రం అదృశ్యమైన అమ్మాయిలు
  • నిన్న చెన్నైలో ఉన్నట్టు మెసేజ్
  • క్షేమంగా ఇంటికి చేరుస్తామంటున్న పోలీసులు
విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపగా, పోలీసులు రంగంలోకి దిగారు. వారి నుంచి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ గురించి వెతకవద్దని తల్లికి మెసేజ్ రావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. వివరాల్లోకి వెళితే, ద్వారకానగర్ లో నివాసం ఉంటున్న మింది అనురాధ (22), తులసి (20), కోమలి (17) అక్కాచెల్లెళ్లు. తులసి, కోమలి నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.

సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వీరు అదే సమయంలో తల్లికి మెసేజ్ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, వారిని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఇంతలో నిన్న తాము చెన్నై చేరుకున్నామని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నామని వారి నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వారు చెన్నై ఎందుకు వెళ్లారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలికలను క్షేమంగా ఇల్లు చేరుస్తామని తెలిపారు. 


More Telugu News